- దళితులు, ఆదివాసీలు, మైనార్టీల ఓట్ల తొలగింపు దుర్మార్గం
- రాజీనామా చేసేదాకా కొట్లాడుతం: ఆకునూరి మురళి, హరగోపాల్
- ఇందిరాపార్కు వద్ద ఎంపీజే ఆధ్వర్యంలో భారీ నిరసన
హైదరాబాద్, వెలుగు: ఎస్ఐఆర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలు, ముస్లిం మైనార్టీల ప్రజాస్వామిక హక్కులకు ప్రమాదం ఏర్పడుతోందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, విద్యావేత్త ప్రొఫెసర్ జి. హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్‌ను రద్దు చేసి, సీఈసీ పదవి నుంచి దిగిపోయే వరకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
వివాదాస్పద ఎస్ఐఆర్‌ను రద్దు చేయాలని, సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ‘మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్’ (ఎంపీజే) ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. ఆకునూరి మురళి, ప్రొఫెసర్ హరగోపాల్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.
చనిపోయిన వారి ఓట్లు, డబుల్ ఓట్లను తొలగించాల్సింది పోయి, బీజేపీ విధానాలను వ్యతిరేకించే వర్గాల ఓట్లను ఎన్నికల సంఘం కావాలనే తొలగిస్తోందని నేతలు ఆరోపించారు. దీనివల్ల దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోయిందని, కేంద్ర పాలకుల చేతుల్లో కీలుబొమ్మలా మారి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసనలో వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
